ఆయన దగ్గరికి వస్తే తలనొప్పి ఈ రోజుకు కాస్తా వదిలేయరాదా అని అప్పుడప్పడు మగువ అంటుంది. దాని మీద ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని సరదా జోకులు ఉన్నాయి. వాటి మీద కార్టూన్లు కూడా వచ్చాయి. కానీ, నిజానికి శృంగారంలో పాల్గొంటే తలనొప్పి తగ్గుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. పైగా, పార్శ్వపునొప్పితో బాధపడే వారిలో సగానికి సగం మందిలో సెక్స్‌లో పాల్గొన్నాక కొంత మేరకు ఉపశమనం కలిగిందని, ప్రతి ఐదుగురిలో ఒకరికి పార్శ్వపునొప్పి పూర్తిగా తగ్గిందని యూనివర్సిటీ ఆఫ్ మున్‌స్టర్ (జర్మనీ) తాజా పరిశోధనలో తేలింది.
ఈ ప్రయోగంలో భాగంగా వర్సిటీ న్యూరాలజిస్టులు.. పార్శ్వపునొప్పి, క్లస్టర్ తలనొప్పితో బాధపడుతున్న 400 మంది రోగుల నుంచి సమాచారాన్ని సేకరించారు. వారిలో 33 శాతం.. తమకు తలనొప్పి వచ్చినప్పుడు శృంగారంలో పాల్గొంటామని చెప్పారు. ఆ 33 శాతంలో మైగ్రెయిన్‌తో బాధపడుతున్నవారిలో 60 శాతం, క్లస్టర్ తలనొప్పి బాధితుల్లో 36 శాతం శృంగారం వల్ల తమకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
పెయిన్ కిల్లర్ల కన్నా తలనొప్పికి సెక్స్ ద్వారానే ఉపశమనం ఎక్కువ కలుగుతుందని పరిశోధనలో తేల్చారు. అంతర్జాతీయ హెడ్ ఏక్ సొసైటీ ప్రచురించే సెఫలాజియా పత్రికలో పరిశోధనాంశాలను ప్రచురించారు. సెక్స్ తర్వాత ప్రతి ఐదుగురిలో ఒక్కరికి ఆ తర్వాత ఏ మాత్రం తలనొప్పి లేకుండా పోయింది. ఇతరులు ముఖ్యంగా పురుషుల్లో లైంగిక క్రీడను తలనొప్పిని తగ్గించే మందుగా వాడినట్లు తేలింది.
లైంగిక క్రీడలో శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయని, ఇది సహజమైన నొప్పి నివారణ గుళికలుగా పనిచేస్తాయని పరిశోధకులు తేల్చారు. తలనొప్పిని పూర్తిగా నివారించే లక్షణం కూడా వీటికి ఉందని అంటున్నారు.