కొన్నాళ్ల వరకు మోనోపాజ్ అనే పదం అందరికీ సుపరిచితమైనా ఆండ్రోపాజ్ అనేది మాత్రం ఇటీవలే అందరికీ తెలిసొస్తోంది. ఎందుకంటే మధ్య వయసు తర్వాత హార్మోన్ల అసమతుల్యం వల్ల స్త్రీలలో మాత్రమే మోనోపాజ్ దశ ఏర్పడుతుందనే భావన దాటి ఆదే విధమైన సమస్యలు పురుషుల్లోనూ తలెత్తుతుందని నేడు అందరికీ తెలిసి వచ్చింది. దాదాపు 40 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో ఈ ఆండ్రోపాజ్ దశ తలెత్తుతుంది. ఈ ఆండ్రోపాజ్ వల్ల సెక్స్ జీవితంలో ఆసక్తి లోపించడం, అంగస్థంభన సమస్యలు తలెత్తడం ప్రధానమైంది. శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మన్ స్రావం అదుపుతప్పడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.
అందుకే శరీరంలో తగ్గిన టెస్టోస్టిరాన్ హార్మన్ స్రావం తగినంత ఉండేలా చేయడం ద్వారా ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. ఇందుకోసం ముందు నుంచే ఆహార విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే సమస్య రాకుండా ఉండేందుకు అవకాశముంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సోయా, పాలు, చికెన్‌లాంటి పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోవడం, వేరుశెనగ, బాదం, జీడిపప్పులాంటివి ఆహారంలో ఉండేలా చూచుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావాన్ని పెంచవచ్చు. దీంతోపాటు సి, ఇ విటమిన్లు సంవృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావం తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు. ఇలా ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాన్ని కూడా అవలంభిస్తే ఆండ్రోపాజ్ సమస్య నుంచి వీలున్నంత దూరంగా ఉండవచ్చు.