ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ ఆధ్యాత్మికతకి, శృంగారానికి మధ్యనున్న అంతరాన్ని ఓ సదస్సులో ఇలా వివరించారు. శృంగారం సృష్టికి, ఆధ్యాత్మికత ముక్తికి సంబంధించినది. ఇప్పడు మనం ఉన్నామంటే సృష్టి కారణం. సృష్టికి కారణం ఆ శృంగారమే. అదే లేకుంటే ఇప్పటికి సృష్టి అనేది ఉండేది కాదు. ఐతే ముక్తికి కారణమైన ఆధ్యాత్మికతకు శృంగారానికి మధ్య సమతుల్యత పాటించాలి. శృంగారంలోని ఆనందం పరిమితం, ఆధ్యాత్మికత ఆనందం శాశ్వతం. కాబట్టి లైంగికశక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవాలి. లేదంటే అది అదుపు తప్పి మనల్ని మింగేస్తుంది. మనిషి జీవితం కోరిక నుంచి ఉపాసన దిశగా మళ్లాలని భారతీయ ధర్మం చెబుతోంది. విలువలు లేకపోతే శృంగారం గాడి తప్పుతుంది. అది సమాజాన్ని కలుషితం చేస్తుంది. దాంతో మొత్తం వ్యవస్థే కలుషితమవుతుంది. ప్రజలు పలు వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. చాలామంది తాము లైంగిక సమస్యలతో బాధపడుతున్నట్లు చెబుతారు. కానీ యోగం లేని భోగం వ్యర్థమని తెలుకోలేక పోతున్నారు. సృష్టిలో దేనికీ హద్దుల్లేని స్వచ్ఛ లేదు. అలాగే శృంగారానికీ కొన్ని పరిమితులున్నాయి. కట్టుబాట్లు లేకుంటే వినాశనం తప్పదు.