శృంగారాన్ని మనసారా జుర్రుకోవాలని భారతీయ సంప్రదాయం చెప్పుతుంది. అయితే దాన్ని సమాజం ఆమోదించిన మార్గాల్లోనే పొందాలని నిర్దేశిస్తుంది. శృంగారంలోని ఆనందమంతా మైథునం వల్ల వచ్చింది కాదని, శరీరమూ మనసూ ఒక్కటైనట్లు అనిపించే స్థితిలోంచి, భావప్రాప్తిలోంచి వచ్చిన తన్మయత్వమని అంటారు. ప్రపంచమంతా సెక్స్ ను శారీరక అవసరంగా భావిస్తున్న రోజుల్లోనే భారతదేశం దాన్ని పురుషార్థాల్లో ఒక్కటిగా గుర్తించింది. పాశ్చాత్యులు బహిరంగంగా చర్చించుకోవడానికి వెనకాడుతున్న కాలంలో మన దగ్గర శృంగారానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాలున్నాయి. కామశాస్త్ర ప్రతిపత్తిని భారతదేశం కల్పించింది. భారతీయత లైంగిక ఆనందానికి దూరంగా ఉండుమని చెప్పదు. అదే సమయంలో విశృంఖలత్వాన్ని ప్రోత్సహించదు. లైంగిక వాంఛను అణచేయాలని కూడా చెప్పదు. శారీరక సుఖం ఆధ్యాత్మిక స్థితికి తీసుకుపోతుందని భారతీయ శాస్త్రాలు చెప్తాయి.