ఆధునిక కాలంలో వీర్యంలో నాణ్యత లోపించడమనేది సమస్యగానే మారింది. జీవనశైలి వల్ల అది సంభవిస్తుంది. దానికితోడు, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం వాడే వస్తువులు కూడా కొన్ని అందుకు దోహదం చేస్తున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది.
ఉదయం నిద్ర లేవగానే పేస్టుతో పళ్లు రుద్దుకుంటాం, సబ్బుతో స్నానం చేస్తాం. కొందరైతే సూర్యుడి అతి నీలలోహిత కిరణాల బారి నుంచి రక్షించుకోవడానికి ఎండలో వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటారు. వీటన్నిటి తయారీలో వాడే రసాయనాలు పెద్దగా హాని చేయనివని శాస్త్రవేత్తలు భావిస్తుూ వచ్చారు.
మనం వాడే వస్తువుల్లో వాడే రసాయనాల వల్ల పురుషుల్లోని వీర్యంలో నాణ్యత లోపిస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. వాటివల్ల ప్రమాదం సంభవిస్తోందని అంటున్నారు. అయితే, ఈ పరిశోధనలన్నీ టెస్టు ట్యూబుల్లో, ల్యాబ్‌ల్లో జరిగిన ప్రయోగాలనీ, అటువంటి ప్రమాదం ఏదీ ఉండదని కొంత మంది కొట్టిపారేస్తున్నారు.
రసాయనాల ప్రమాదం
ఆయా వస్తువుల తయారీలో వాడే 100 రకాల రసాయనాల్లో ప్రతి మూడింటిలో ఒకటి వీర్యం నాణ్యతను తగ్గించివేస్తోందని, పురుషుల్లో సంతానసాఫల్య శక్తిని నశింపజేస్తోందని తాజా అధ్యయనంలో తేలింది.
విదేశాల్లో ఎక్కువ
పాశ్చాత్య దేశాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉందని రుజువైంది. జర్మనీ, డెన్మార్క్ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ రసాయనాలను పరీక్షించి మరీ ఇచ్చిన నివేదిక ఇది.
ప్లాస్టిక్ బొమ్మల్లోనూ..
సన్స్క్రీన్లోషన్లలోనూ చిన్నపిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బొమ్మల్లోనూ, సబ్బులు, టూత్పేస్టుల వంటివాటి తయారీలో వినియోగించే రసాయనాల్లో పురుషుల్లో సంతానసాఫల్యతను తగ్గిస్తున్నాయంటూ వారు ఇచ్చిన ఈ నివేదిక ఎంబో రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమైంది.
వీర్యకణాల కదలికలపై ప్రభావం
వివిధ వస్తువుల్లోని రసాయనాలు దేనికవే చూపే ప్రభావంతో పోలిస్తే, దేహంలోకి చేరుకున్న తర్వాత ఈ రసాయనాలన్నీ కలగలిస్తే (కాక్టైల్ ఎఫెక్ట్) వీర్యకణాల కదలికలను, ఈదే శక్తిని తగ్గించివేస్తాయని, అవి వేగంగా ఈదుకుంటూ వెళ్లి అండంలోకి చొరబడి సంయోగం చెందే శక్తి తగ్గిపోతుందని నివేదికలో చెప్పారు.
జెండర్ బెండింగ్ కెమికల్స్
వీర్య కణాలపై ప్రభావం చూపే తరహా రసాయనాలను 'జెండర్ బెండింగ్ కెమికల్స్' అంటారు. అయితే, కొందరు శాస్త్రజ్ఞులు మాత్రం ఇవన్నీ ల్యాబ్లో టెస్ట్ట్యూబ్లో జరిగిన ప్రయోగాలని, నిజంగా మానవులపై ఆయా రసాయనాల ప్రభావం అంతగా ఉండదని ఈ నివేదికను కొట్టిపారేస్తున్నారు.