గర్భ నియంత్రణ సమాచారం ఎలా వుండాలి? టీనేజర్లకు గర్భ నిరోధక మాత్రలు వాటిని ఉపయోగించే విధానం తెలియజేస్తే సెక్స్ ఎడ్యుకేషన్ సమర్ధవంతంగా వుంటుంది. అమెరికాలో చేసిన ఒక సెక్స్ ఎడ్యుకేషన్ ప్రయోగంలో సుమారు టీనేజ్ ప్రెగ్నెన్సీలు సుమారు 80 శాతం వరకు తగ్గిపోయినట్లు తెలిసింది. అంటే అబార్షన్ ల సంఖ్య తగ్గాలంటే, గర్భ నియంత్రణ సాధనాల వాడకం వారికి బాగా తెలియాలి. చాలామంది టీనేజ్ గాల్స్ కు లైంగికపర అవగాహన, గర్భ నియంత్రణ వంటి విషయాలు తెలియకపోవటంతో సమస్యలు వస్తున్నాయి.
టీనేజర్లకు సెక్స్ ఎడ్యుకేషన్ బోధనలో అధికభాగం ఆరోగ్యకర సంతానోత్పత్తికి ప్రాముఖ్యం ఇవ్వాలి. సెక్స్ ప్రవర్తన అంటే ఏమిటో తెలియజెప్పాలి.
టీనేజ్ ప్రెగ్నెన్సీ కలిగితే వీరు స్కూళ్ళనుండి విద్యను సైతం మానేస్తారు. సమాజంలో వారికి చెడుపేరు కలుగుతుంది. టీనేజ్ లో తల్లులైనవారు, దీర్ఘకాలం అవివాహితలుగానే మిగిలిపోతున్నట్లు సర్వేలు చెపుతున్నాయి.
వాషింగ్టన్ యూనివర్శిటీ జరిపిన ఒక పరిశోధనలో సమగ్ర లైంగిక విద్య పొందిన వారిలో 60 శాతం మందికి టీనేజ్ గర్భ ధారణ అవకాశాలు తగ్గినట్లు తేలింది. ఒక టీనేజర్ ఏ దశలో కూడా అవసరమైన వైద్య సహాయం తీసుకోకుండా వుండరాదు. కొన్ని టీనేజ్ గర్భ ధారణ కేసులలో పిల్లలలో ఎదుగుదల లేనందున రక్తహీనత వంటివి సమస్యలుగా మారాయి. ఇంకా పరిపక్వం కాని జననేంద్రియ వ్యవస్ధ కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
టీనేజ్ గర్భవతుల సమస్యలు అతి జాగ్రత్తగా వ్యవహరించవలసివుంటుంది. తల్లితండ్రులు, ఆమె చుట్టూ వున్నవారు ఆర్ధికంగా, మానసికంగా ఆమెకు చేయూతనివ్వాలి. లేకుంటే, ఆమెకుగల దుర్ఘటన ఆమెను శాశ్వతంగా మానసిక వికలాంగిగా చేసి పూర్తిగా కుంగదీస్తుంది. కనుక బాలికలు భాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటే లైంగిక విద్య ఎంతో అవసరం.