ఎంతోమంది, మొదటి చూపులతోనే ప్రేమలో పడిపోతారు. డేటింగ్ లో ఒక సంవత్సరం కూడా కాకుండానే వివాహానికి సిద్ధమైపోతారు. వివాహమైన ఆరు నెలలు కాకుండానే పెద్ద తప్పు జరిగిపోయిందంటూ విడాకులకు దిగుతారు. మరో ఎఫైర్ నడుపుతారు. అయితే డేటింగ్ ఒక సంవత్సరమైనా, ఆరు నెలలే అయినా, ఎన్నాళ్ళు చేశారనేది కాదు! భాగస్వామి అలవాట్లు, ప్రవర్తన ఎంతబాగా స్టడీ చేశారనేది ప్రధానం అంటారు మానసిక వేత్తలు. డేటింగ్ లో భాగస్వామి సరిపోలదని వారికి అనిపిస్తున్నప్పటికి వివాహానికి సిద్ధమైపోతారు.
ప్రేమను పుట్టించేందుకు బ్రెయిన్ లో ఒక రసాయనం వుంటుంది. దానిపేరే డోపమైన్. మీ కలయిక ఎక్కువకాలం సాగదని అనిపిస్తున్నప్పటికి ఈ రసాయనం మిమ్మల్ని ముందుకే ప్రేరేపిస్తుంది. అయితే, ఈ పాజిటివ్ భావన మరో ఆరునెలలకాలంలో మాయమవుతుంది. అప్పటివరకు మంచి అలవాట్లు అనుకున్నవి చెడుగా భావించి కోపాన్ని తెప్పిస్తాయి. చాలా సార్లు, వ్యక్తులు వారి భవిష్యత్ ప్రణాళికలు వారి ప్రస్తుత అంశాలకు సరిపోలవని, త్వరలోనే సంబంధాలు విడివడతాయని గ్రహించలేరంటారు వివాహ విషయ నిపుణులు. పిల్లలు, వ్యయం, సంపాదన, పని పాటలు మొదలైన వాటిల్లో ఇరువురికి ఒకే లక్ష్యం వుండాలంటారు. మరి ఈ అంశాలు పరిశీలనకుగాను పెళ్ళికి ముందరే భాగస్వాములిరువురూ అది కొద్ది నెలలే అయినప్పటికి లోతుగా చర్చించుకోవలసి వుంటుంది.