పై పరిశోధనలకు నేతృత్వం వహించిన సుసాన్ జాబ్లింగ్ మాట్లాడుతూ - ఇటీవలి కాలంలో పురుషుల్లో సంతాన సాఫల్య సమస్యలు పెరగడానికి ఇతరత్రా కారణాలతో పాటు, నీటి కాలుష్యమూ ప్రధాన కారణంగా ఉంటోందని అన్నారు. నీటిలో కలసిపోయిన వ్యర్థ రసాయనాలు పురుషుల్లో టెస్టిక్యులర్ డిస్‌జెనిసిస్ అనే సమస్యకు కారణాలవుతున్నాయని వివరించారు. ఇప్పటివరూ ఈ దిశగా జరిగిన అధ్యయనాలన్నీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని సుసాన్ తెలిపారు.
నీటి కాలుష్యం వల్ల పురుషుల లైంగిక సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.నీటి కాలుష్యానికి కారణమైన కొన్ని రసాయనాలు పురుషుల్లో లైంగిక హార్మోన్లను నిర్వీర్యం చేస్తున్నాయని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. లండన్‌లోని బ్రూనెల్ యూనివర్సిటీ పరిశోధకులు నీటి కాలుష్యానికి కారణమైన రసాయనాలు, మానవులపై వాటి ప్రభావం అన్న విషయంపై, మూడు సంవత్సరాలకు పైబడి అధ్యయనం జరిపారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నేరుగా జల వనరుల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ రసాయనాలు ఒక్క మానవులనే కాకుండా, వన్యప్రాణులు, పక్షులు, మరీ ముఖ్యంగా మగవారి సంతాన సాఫల్యతపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నట్లు వీరు కనుగొన్నారు.