శృంగార కార్యకలాపాల్లో జీవిత భాగస్వామిని మోసం చేయడం వల్ల సంబంధాలు దెబ్బ తినడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందట. ప్రతి నాలుగో పురుషుడు, ప్రతి ఐదో మహిళ తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారట. ఈ విషయం ఓ పరిశోధనలో వెల్లడైంది. సంబంధంలో అసంతృప్తి కారణంగానే పురుషులు గానీ స్త్రీలు గానీ తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తారని పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఆ అసంతృప్తి వల్లనే మరో చోట తృప్తి కోసం వెతుకుంటారని తేలింది. అది ఒకటి రెండు పర్యాయాలు మోసం చేయడంతో ఆగిపోదని, అద ఓ అఫైర్‌గా మారిపోతుందని చెబుతున్నారు. అది నెలల తరబడి, ఏళ్ల తరబడి కొనసాగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చాటుమాటు వ్యవహారం ఎప్పుడో ఒకసారి బయట పడక తప్పదని, దాని దుష్ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుందని అంటున్నారు.
భాగస్వామిని మోసం చేయడం వల్ల ఆరోగ్యంపై ఉద్వేగపరంగా, శారీరకంగా ప్రతికూల ప్రభావం పడుతుందని వారంటున్నారు. టునిన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న పురుషులు తలనొప్పి, తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతారట. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయంటున్నారు. కొలొరాడో విశ్వవిద్యాలయం పరిశోధకులు కూడా అదే విషయం చెబుతున్నారు. మోసం చేసే వ్యక్తిపైనే కాకుండా మోసానికి గురైన వ్యక్తి ఆరోగ్యం మీద కూడా అది దుష్ప్రభావం చూపుతుందని అంటున్నారు. తన భాగస్వామి మోసం చేస్తున్నట్లు గుర్తించిన వ్యక్తి భయాందోళనలకు, డిప్రెషన్‌కు గురవుతారని చెబుతున్నారు. అక్రమ సంబంధాల వైపు చూడకుండా జీవిత భాగస్వామితో స్పష్టంగా మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.