రెండువేల ఏళ్లనాటి భారతీయ సమాజాన్ని చూడాలంటే, వాత్సాయనుడి కామసూత్రం చదవాలి. ఆ జీవితం నిత్యవసంతం. ముక్కారు పంటలు పండేవి. సిరిసంపదలకు కొదువ లేదు. రేపెలా గడుస్తుందన్న భయం లేదు. శత్రు భీతి లేదు. రోగాల బాధ లేదు. ఎవరికి వారు రసాగ్రేసులు. పడకటిల్లు ప్రణయ సామ్రాజ్యం. ప్రాచీన భారతీయులు శయన మందిరానికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చేవారు. ఏకాంతానికి ఆటంకం లేకుండా నిర్మించుకునేవారు. కాంత అభిరుచికీ పెద్ద పీట వేసేవారు. పడకగది అలంకరణ ఓ శాస్త్రమే. ఆట విడుపు కోసం ఓ వీణ ఉండేది. సృష్టికార్యం నుంచి మనసు ఏ సాహితీ సృష్టివైపో మళ్లినపుడు మనసారా రాసుకోవడానిరి మాంచీ లేఖన సామాగ్రి ఉండేది. నడిరేయి ఏ జామునో...పెదాలతో చుంబన చిత్రాలూ కొనగోటితో నఖ చిత్రాలూ గీసిన వలపు అలపు తీర్చుకోవడానికి వర్ణ చిత్రాలేమైనా గీసుకోవాలనిపిస్తే రంగుల సరంజామా సిద్ధంగా ఉండేది. పెదాలు తడుపుకోవడానికి వెండి పళ్లెంలో సుగంధ ద్రవ్యాల గిన్నె, సందేహాలు తీర్చుకోవడానికి కామశాస్త్ర గ్రంథాల అర, రవికముడి బిగించుకోవడానికీ, చీరచెంగు సరి చేసుకోవడానికీ నిలువుటద్దం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా రతీదేవిని మరిపించే సతీదేవి అలకలుబోయేది.