సాంఘిక నియమాల వల్ల, శృంగారంపై బహిరంగంగా మాట్లాడే వాతావరణం లేనందున సాధారణంగా చాలా మంది యువతులు లేదా మహిళల్లో రతిక్రీడపై పలు అనుమానాలు ఉంటాయి. సెక్స్ అంటే భయం గూడుకట్టుకుని ఉంటుంది. తమ సందేహాలను తీర్చుకోవడానికి కూడా అవకాశం తక్కువగా ఉంటుంది. సందేహాలను తీర్చుకోవడానికి కూడా జంకుతుంటారు.
మరికొంతమందిలో రతిక్రీడపై అసహ్యం పేరుకుపోతుంది. అది జుగుప్సాకరమైన క్రీడగా వారు భావిస్తుంటారు. పాపకార్యమని కూడా అనుకుంటారు. దాంతో వివాహమై ఏళ్లు గడుస్తున్నా కొంతమంది స్త్రీలు శృంగారం పట్ల సముఖత చూపరు.
ఆరోగ్యం, శారీరక స్పందన, భావోద్వేగాలు, అనుభవాలు, నమ్మకాలు, భార్యభర్త మధ్య సంబంధాలు, జీవనశైలి వంటి ఎన్నో విషయాలతో స్త్రీ లైంగిక చర్య ముడి పడి ఉంటాయి. స్త్రీలలో లైంగిక సమస్యలు పురుషులలో వచ్చినంత తరచుగా రాకపోయినా మరీ అంత అసాధారణమేమీ కాదు. అందువల్ల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే కామవాంఛ బుసలు కొట్టి లైంగిక జీవితం సాఫీగా సాగుతుంది.
బిడియం గూడుకట్టి..
సెక్స్ విషయాల గురించి తమ స్నేహితులతో సులభంగా స్త్రీలు చర్చించుకునేందుకు ఆసక్తి చూపరు. లైంగిక విషయాలపట్ల చర్చిస్తే తమ గురించి ఏమనుకుంటారో అనే భయం, బిడియం వల్ల తమలో తామే కుంగిపోతుంటారు.
జీవిత భాగస్వామితోనూ ..
జీవితభాగస్వామితో కూడా రతిక్రీడపై చర్చించడానికి కొంత మంది మహిళలు బిడియపడుతుంటారు. ఒకవేళ చెప్పుకున్నా జీవితభాగస్వామి పట్టించుకోకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వంటి కారణాల వల్ల అది మరింతగా పేరుకుపోతుంది.
మనస్పర్థలు కూడా..
జీవిత భాగస్వామితో మనస్పర్థల వల్ల లైంగిక వాంఛలపట్ల విముఖత ఉత్పన్నమవుతుంది. ఇంటి వాతావరణం, పరిస్థితుల వల్ల రతిక్రీడకు దూరమవుతుంటారు.
ఆకర్షణ తగ్గుముఖం..
భార్యాభర్తల మధ్య పరస్పర ఆకర్షణ తగ్గడం, భాగస్వామి నుంచి తగినంత ఉత్తేజం, ప్రేరణ, ఫోర్ ప్లే లేకపోవడం వంటి కారణాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి.
నొప్పి వల్ల కూడా..
కలయిక సమయంలో భావప్రాప్తి కలగకపోవడం, ఆ సమయంలో బాధ, నొప్పి రావడం వంటి వాటి వల్ల స్త్రీ లైంగిక కార్యకలాపాల పట్ల విముఖంగా ఉంటుంది.
తన కోసం కాదనే భావన..
భర్త తనను కేవలం ఆ సుఖం కోసమే ఉపయోగిస్తున్నాడన్న అపోహలో పూర్తిగా సెక్స్ అంటేనే భార్య కస్సుమనే పరిస్థితి ఉంటుంది.
సలహా తప్పదు..
లైంగికాసక్తి తగ్గడంపై, ఇతర లైంగిక సమస్యలపై వైద్యనిపుణులను సంప్రదించి పరిష్కారం కనుక్కుంటే దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది.