ప్రస్తుతం కుటుంబ సభ్యుల విషయంలో, సంబంధ బాంధవ్యాల విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా, తగాదా ఏర్పడినా దంపతుల మానసిక స్థితి చెడిపోతోంది. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఇలాంటి సందర్భాల్లో పుట్టింటి నుంచి కాస్తంత మద్దతు లభిస్తే చాలు భర్తనుంచి విడాకులు తీసుకోవడానికి కూడా స్త్రీలు వెనుకాడడం లేదు. భర్తను అంటిపెట్టుకునే పాత్రలో కాకుండా తనకు తానుగా సంపాదించే స్థితిలో భార్య ఉన్నప్పుడు వెంటనే విడాకులు తీసుకోవడానికి కూడా భార్య వెనక్కు తగ్గడం లేదు.
పెళ్లంటే వివాహ సంబంధాల వ్యాపారం కారాదు. దాంపత్యంలో తప్పును ఒప్పుకోవడానికి అహం అడ్డం వస్తే కొద్దిపాటి చేదు కూడా మీ సంబంధాలను చెరిపి వేస్తుంది. మానసిక సాన్నిహిత్యం, భావోద్వేగాలతో అల్లుకోవలసిన సంబంధం అతుకుల బాట పడితే ప్రపంచంలో ఏ న్యాయస్థానం కూడా దాన్ని అతికి సాపు చేయలేదు. మనం ప్రగాఢంగా దేన్నైనా కోరుతున్నప్పుడు, అంతే ప్రగాఢంగా దాన్నే కోరుకునే అవతలి వ్యక్తికి కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి కావాలంటే మరొకటి ఇవ్వాలి. ఇది దాంపత్య జీవన సూత్రం. అదే శృంగార జీవితాన్ని కూడా ఆనందమయం చేస్తుంది.