పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని ప్రముఖ కవి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకంలోని గిరీశం అన్నాడు. ఇది దొరల్ తాగు సిగరెట్టు అని ఓ తెలుగు సినిమాలో భర్త అంటే కంపు కొట్టు సిగిరెట్టు అని భార్య ఈసడించుకుంది. పొగ తాగడం వల్ల వెలువడే దుర్వాసనకే ఆడవాళ్లు పురుష భాగస్వామిని ముద్దులకు దూరంగా ఉంచుతారని అనుకుంటారు. పడక గదికి వెళ్లే ముందు నోరు శుభ్రం చేసుకునే మగవాళ్లు కూడా ఉన్నారు. భార్యలకు కనిపించకుండా చాటుమాటుగా సిగరెట్టు దమ్ము లాగే పురుష పుంగవులూ ఉన్నారు. అయితే సిగరెట్టు తాగడం వల్ల సెక్స్ పాటవం తగ్గుతుందని, దాని వల్ల సమస్యలు తలెత్తుతాయని హాంగ్ కాంగ్ లోని ఓ విశ్వవిద్యాలయం పరిశోధన వెల్లడించింది. 90 శాతానికి పైగా పొగ తాగడం వల్ల సెక్స్ లో సమస్యలు ఎదుర్కుంటున్నట్లు, సెక్స్ సౌఖ్యాన్ని సరిగా అనుభవించలేకపోతున్నట్లు తేలింది. ఆ యూనివర్శిటీ సిగిరెట్టు తాగే 700 మందిపై పరిశోధనలు చేసింది. సిగరెట్టు మానేయడం వల్ల సెక్స్ పరమైన సమస్య 53.8 శాతం మందిలో ఆరు నెలల్లో తీరిపోయిందని పరిశోధనలో తేలింది. కాగా, 28.17 శాతం మందిలో మాత్రమే సమస్య సులభంగా పరిష్కారం కాలేదని తేలింది. ఏమైనా, పడక గదిలో కంపు కొట్టు సిగరెట్టు అంటే జీవిత భాగస్వామి దూరంగా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. వద్దంటే సిగరెట్టు తాగినప్పుడు ఆమె మనసు కూడా పాడవుతుంది. దానివల్ల శృంగారానుభవం మీద పడే ప్రభావం తక్కువేమీ కాదు.