ఆనందాన్నీ ఆకర్షణనీ ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించారు పూర్వీకులు. దానికి కారణం స్త్రీ, పురుష సంయోగాన్ని ప్రకృతికి అన్వయిస్తూ సృష్టిని అర్థం చేసుకోవడమే అంటారు పురాణవేదమ్ రచయిత రాణి శివశంకర శర్మ. లైంగిక వాంఛలు మితిమీరితే ఎలాంటి అపార్థాలు వస్తాయో, కోరికలు దారితప్పితే జీవితం ఎలా పతనమవుతుందో చెప్పడానికి రామాయణ, భారత, భాగవతాల్లో లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. పర స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటే ఎంత మహా వీరుడైన ఎంత భక్తాగ్రేసరుడైనా ఎంత విద్వత్సంపన్నుడైనా చివరకు ఆతని జీవితం ఎలా ముగుస్తుందో రామాయణం కళ్లకు కట్టింది. రఘువంశంలో అగ్నివర్ణుడనే రాజు కామం నెత్తికెక్కి అర్ధయుష్కుడై మరణిస్తాడు. భయంతోనో, జుగుప్సతోనో శృంగారంలో పాల్గొంటే ఏం జరుగుతుందో చెప్పడానికి భారతంలో పాండురాజు జనన వృత్తాంతమే పెద్ద ఉదాహరణ. శంతన మహారాజుకు సత్యవతి వల్ల విచిత్రవీర్యుడనే కుమారుడు జన్మిస్తాడు.